మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయ పునర్‌ప్రవేశం, మీడియా రంగంలో అడుగుపెట్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన మాజీ రాజ్యసభ సభ్యుడు వేనం‌బక విజయసాయి రెడ్డి మళ్లీ రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. ఒక సంవత్సరం క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన ఆయన, ఇప్పుడు మీడియా వేదికను ఆయుధంగా చేసుకుని తిరిగి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌తో పాటు టెలివిజన్ వార్తా ఛానల్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

68 ఏళ్ల విజయసాయి రెడ్డి శనివారం ThePrint‌తో మాట్లాడుతూ, తన రాజకీయ భవిష్యత్‌కు బలమైన పునాది వేసే లక్ష్యంతో ఈ మీడియా ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ఈ ఏడాది జూలైలో ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, టెలివిజన్ వార్తా ఛానల్‌ను 2027 ఉగాది సందర్భంగా ప్రారంభించాలన్నది ఆయన ప్రణాళిక. ఈ రెండు వేదికల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ప్రత్యర్థులకు సమాధానం ఇవ్వడంతో పాటు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలన్నది ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది.

ఈ మీడియా సంస్థల నిర్వహణ బాధ్యతలను తన కుమార్తె నేహా రెడ్డికి అప్పగించనున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తాను విశాఖపట్నంలో ఉన్నానని, ముందుగా మొత్తం జిల్లాను, అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 2029 ఎన్నికల ముందు ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావాలని భావిస్తున్నట్లు చెప్పారు. తన రాజకీయ మార్గాన్ని ఖరారు చేసిన తర్వాత ఛానల్‌ దినచర్య బాధ్యతలన్నీ నేహా రెడ్డికి అప్పగిస్తానని వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన విజయసాయి రెడ్డి, అయినప్పటికీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్, టెలివిజన్ ఛానల్‌ల ప్రధాన కార్యాలయాలు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉండనున్నాయని తెలిపారు. X వేదికలో చేసిన పోస్టులో, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వార్తలు అందుబాటులో ఉంటాయని, శాటిలైట్ వార్తా ఛానల్ మాత్రం పూర్తిగా తెలుగులోనే ప్రసారం అవుతుందని చెప్పారు. ఈ వేదిక సమతుల్యంగా, పక్షపాతం లేకుండా, నిజానిజాలకు కట్టుబడి పనిచేస్తుందని, సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు, బలహీన వర్గాల సమస్యలను వెలుగులోకి తేవడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

తన మీడియా ప్రాజెక్ట్‌లో ఎలాంటి భాగస్వాములు లేరని, ఏ ఒక్క రాజకీయ పార్టీతోనూ ఈ వేదిక అనుబంధం ఉండదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పూర్తిగా స్వతంత్రంగా, ఏ పార్టీకి అనుకూలంగా కాకుండా పనిచేసే ప్లాట్‌ఫారమ్‌గా దీన్ని తీర్చిదిద్దుతానని చెప్పారు. 2025 జనవరిలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన ఆయన, ఇప్పుడు మీడియా రంగ ప్రవేశంతో పాటు కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండటం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.