దేశవ్యాప్తంగా గృహ వినియోగదారుల కోసం 5 కిలోల ఎఫ్‌టీఎల్ ఎల్పీజీ సిలిండర్లను సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్టు సంబంధిత సంస్థలు వెల్లడించాయి. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు చూపిస్తే సరిపోతుందని, ప్రత్యేకంగా చిరునామా రుజువు అవసరం లేదని స్పష్టం చేశాయి. దీంతో తాత్కాలికంగా ఒక ప్రాంతంలో ఉన్నవారు, అద్దె ఇళ్లలో నివసిస్తున్నవారికి కూడా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్టు పేర్కొన్నారు.

5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లకు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. నిన్న ఒక్క రోజులోనే 71 వేలకుపైగా 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు అమ్ముడైనట్టు అధికారులు తెలిపారు. మార్చి 23 నుంచి ఇప్పటివరకు మొత్తం 5.7 లక్షల 5 కిలోల ఎఫ్‌టీఎల్ సిలిండర్లు పంపిణీ చేసినట్టు వివరించారు. చిన్న కుటుంబాలు, తరచుగా ప్రయాణాలు చేసే వారు, విద్యార్థులు వంటి వర్గాలకు ఈ సిలిండర్లు ఉపయోగకరంగా మారుతున్నాయని తెలిపారు.

ఇదిలా ఉండగా, పైప్‌లైన్ ద్వారా సరఫరా చేసే పిఎన్‌జి కనెక్షన్ల విస్తరణ కూడా వేగంగా కొనసాగుతోంది. మార్చి 2026 నుంచి ఇప్పటివరకు 3.5 లక్షలకుపైగా పిఎన్‌జి కనెక్షన్లు గ్యాసిఫై చేసినట్టు సమాచారం. ఈ కనెక్షన్ల ద్వారా గృహాలకు నిరంతర వంటగ్యాస్ సరఫరా కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని సంబంధిత సంస్థలు వెల్లడించాయి. ఎల్పీజీ సిలిండర్లు, పిఎన్‌జి కనెక్షన్ల ద్వారా మరింత మంది వంటగ్యాస్ సౌకర్యాన్ని పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు.

Source: indianewsdiary